అలెర్ట్… తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో… పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్రా, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వెల్లడించింది.

వర్షాలు /Rains

ఇక ఏపీలోనూ 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు వివరించారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.