రాజగోపాల్ రెడ్డి రాజీనామా అర్థం లేనిది – మంత్రి జగదీష్ రెడ్డి

రాజగోపాల్ రెడ్డి రాజీనామా అర్థం లేనిదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన అమ్ముడుపోయారని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పాటు అయిన గట్టుప్పల్ మండలం ఏర్పాటు సభలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం మునుగోడుకు ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. ద్రోహం, స్వార్థం తప్ప రాజగోపాల్ రెడ్డికి అభివృద్ధి చేయాలనే సోయి లేదన్నారు. నాడు బ్రిటిష్ వారికి జమీందారులు మద్దతు ఇచ్చినట్లుగానే నేడు బిజెపికి రాజగోపాల్ రెడ్డి మద్దతిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే మునుగోడు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ మండలం భారీ మెజారిటీని ఇచ్చి కెసిఆర్ కు బహుమతిగా ఇవ్వాలని కోరారు. ప్రజలు ఐక్యమత్యంతో ఉంటే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసుకున్నట్లుగానే అన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చని సూచించారు.