ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం

వివాదాస్పద నేత బీజేపీ గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు రోహిత్ సింగ్ ఈ రోజు ఆత్మహత్య చేసుకుని మరణించారు. రాజాసింగ్ బావమరిది మనీష్ సింగ్ కుమారుడు అయిన రోహిత్ సింగ్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. వీరి కుటుంబం కూడా రాజాసింగ్ కుటుంబంతోనే కలిసి ఉంటోంది. ఇక రేపు ఉదయం ఎనిమిదిన్నరకు రోహిత్ అంత్యక్రియలు మొదలు కానున్నట్లు సమాచారం. మంగళ్ హాట్ లోని రాజాసింగ్ ఇంటి నుండి శీతలమాత స్మశానం వరకు అంతిమయాత్ర సాగనుందని బిజెపి గోషామహల్ ఇన్చార్జి కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే ఈ కుర్రవాడు ఎందుకు చనిపోయాడు ? అనే దాని మీద క్లారిటీ లేదు. ఇక ఈ రోజు రాజా సింగ్ ప్రెస్ ముందుకు కూడా రాలేదు. కానీ బండి సంజయ్ ని తొలగించమని ఆయన ట్వీట్ చేసినట్లు ఫేక్ ట్వీట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న క్రమంలో ఆయన మీడియాకు ఒక నోట్ పంపించాడు. అందులో బండి సంజయ్ నన్ను మోసం చేసిన మాట వాస్తవమేనని,నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని అడిగానని కానీ పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న రాజాసింగ్ నన్ను గెలిపించిన కార్యకర్త కూడా టికెట్ ఇప్పించు కోలేక పోయాను అని అన్నారు.