తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి ఎస్.బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రోజున ఏసీబీ నిర్వహించిన దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడటంతో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఏసీబీకి ఫిర్యాదు రాగా బుధవారం తెల్లవారుజామున ఆయన ఇళ్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏసీబీ దాడులకు దిగింది.
ఈ సోదాల్లో సుమారు రూ.40 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, అరవైకిపైగా ఖరీదైన గడియారాలు, నలభై వరకు ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్లు, బ్యాంకుల్లో రూ.కోట్ల డిపాజిట్లు, పదుల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బుధవారం ప్రారంభమైన సోదాలు ఈరోజు వరకు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏసీబీ అధికారుల అధీనంలోనే ఉన్న బాలకృష్ణను ఇవాళ కోర్టులో హాజరు పరచనున్నారు.