కాంగ్రెస్ దాడికి సీఎం రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన ఘటన పై ఆయన స్పందిస్తూ.. ఆసక్తికర ట్వీట్ వేశారు. ఈ దాడితోనే కాంగ్రెస్ పతనం మొదలైందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం పై గూండాలు, రౌడీషీటర్లు కాంగ్రెస్ కార్యకర్తల ముసుగులో దాడి చేశారని.. ఈ దాడికి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత వహించాలన్నారు.
ఒవైసీ సోదరులతో వేదిక పంచుకోగానే రేవంత్ రెడ్డి అక్కడే ఈ దాడికి పథకాన్ని రచించారని ఆరోపించారు. గతంలో తమ సొంత సీఎంను దించడం కోసం చెప్పులు వేయడం, మత కల్లోలాలు వారి చరిత్రలో భాగమేనన్నారు. బీజేపీ కార్యాలయం పై పోలీసులే దగ్గరుండి దాడి చేయించినట్టుగా కనబడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మా మాజీ ఎంపీ పొరపాటున దొర్లిన ఒక పదానికి వెంటనే వెనక్కి తీసుకొని తన హుందాతనాన్ని ప్రదర్శించారని.. కానీ నకిలీ గాంధీ కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ కొందరూ రౌడీషీటర్లు కాంగ్రెస్ ముసుగులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.