తెలంగాణ రాష్ట్రంపైనా మిగ్జాం తుపాను ప్రభావం చూపిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాబోయే సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టకముందే ప్రజాసంక్షేమం కోసం చర్యలకు ఉపక్రమించారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో చేసిన ప్రకటనలో.. లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి కోరారు. అలాగే ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని రైతులకు అండగా నిలవాలని సూచించారు.
భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. విద్యుత్, రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి ఆ ప్రకటనలో సూచనలు చేశారు.