తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ కేంద్ర బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి కేటీఆర్ ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకున్నారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించగా.. కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో సభకు రాలేదని విమర్శించారు. మోడీ చూస్తే ఏమైనా అవుతుందేమోనని భయపడుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ సభకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని.. తాము కూడా ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతామని పేర్కొన్నారు కేటీఆర్.
కేసీఆర్ కుటుంబం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ తమ నిర్ణయం చెప్పాలన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకట్లో మాట్లాడుకొని వచ్చిందే మీ అభిప్రాయమా? అన్నారు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని.. తాము అయ్యలు, తాతల పేర్లు చెప్పుకొని పైకి రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగామన్నారు. ఇక అయ్యల పేర్లు, తాతల పేర్లు చెప్పుకొని వచ్చారని ముఖ్యమంత్రి అంటున్నారని.. ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా? అని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.