తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు చూపిస్తోంది. ఓవైపు ముఖ్య నాయకులు.. మరోవైపు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజుకో నియోజకవర్గంలో విజయభేరి సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ఈ సభల్లో ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ తొమ్మిదన్నరేళ్లలో చేసిన తప్పులను.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజావేదికగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కూడా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లా బోథ్‌లో నిర్వహించనున్న కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొననున్నారు.
మరోవైపు మంగళవారం రోజున స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, కామారెడ్డి విజయభేరి సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో వేల ఎకరాలు కబ్జా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పుడు కామారెడ్డిలోనూ భూములు ఆక్రమించేందుకే పోటీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ నుంచి కామారెడ్డి ప్రజల్ని కాపాడేందుకే తాను బరిలో నిలిచినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్ పై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.