రక్షాబంధన్ కానుకగా వంట గ్యాస్ ధరలు తగ్గించింది కేంద్రం. సిలిండర్ పై 250 సబ్సిడీని ప్రకటించింది. ఉజ్వల స్కీం లబ్ధిదారులకు సిలిండర్ పై 400 రూపాయలు తగ్గించింది. తగ్గించిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ బండ ధర 1100 రూపాయలుగా ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఉజ్వల్ లబ్ధిదారులకు ఇకనుండి 700 కే సిలిండర్ లభించనుంది.
ఇక సాధారణ గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ 950 కి లభించనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం పట్ల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. ” ఒక గజదొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకొని.. దారి ఖర్చులకోసం 200 రూపాయలు ఉంచుకోమని ఇచ్చాడట. కాంగ్రెస్ హయాంలో 410 గ్యాస్ బండ ధరను రూ. 1200 చేసి, ఇప్పుడు 200 తగ్గించడాన్ని ఇలా కాక మరెలా అర్థం చేసుకోవాలి” అని ట్వీట్ చేశారు.