కొడంగల్‌లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అని టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి… తన కోసం కాదు.. హస్తం పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసమేనని తెలిపారు. తనకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. కొడంగల్ ఆత్మగౌరవం కోసం శాసనసభలో పోరాటం చేశానని చెప్పారు. తనను గెలిపిస్తే కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ జెండా ఎగురవేయమని లక్షలాది మంది కార్యకర్తలు తనను ఆశీర్వదించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
‘బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారైనా కొడంగల్ అభివృద్ధి గురించి మాట్లాడారా? ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా? కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుంది? కొడంగల్ ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంటుకు పంపిచారు. కేసీఆర్‌ను కడుపులో పెట్టుకుని కొడంగల్ ప్రజలు చూసుకుంటే ఆయన అభివృద్ధిని విస్మరించారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయి. చీలిపోతే కూలిపోతాం… కూలిపోతే జీవితాలు నాశనం అవుతాయి.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.