దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహాడ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆమెను ఈడీ, సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కవిత బెయిల్ కోసం దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. దిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. తిహాడ్ జైలులో ఉన్న కవితను ఈనెల 11వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఈ నేపథ్యంలో కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో 2 వేర్వేరు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ, సీబీఐకి ఇప్పటికే సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.