రాష్ట్రవ్యాప్తంగా 85 శాతం ఇళ్లలో టీవీలున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇటు 40 శాతం మంది స్మార్ట్‌ఫోన్లు, ఐపాడ్స్, ట్యాబ్స్ వంటివి ఉపయోగిస్తున్నారని, కేవలం 6.8% మందికి మాత్రమే ఈ సదుపాయాలేవీ లేవని తెలిపారు. ప్రభుత్వపరంగా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతమందికి ఈ సౌకర్యాలున్నాయి.. ఏ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని వారిని చేరుకోవచ్చు.. తదితర అంశాలపై నిర్వహించిన సర్వేలో భాగంగా ఆయా విషయాలు తెలిశాయి.
వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ–లెర్నింగ్ చేపడుతున్నట్లు, ఎక్కువ మంది విద్యార్థులకు పాఠాలు అందుబాటులో తెచ్చేందుకు దూరదర్శన్, టీ–శాట్‌ల ద్వారా ఆన్‌లైన్ తరగతులను ప్రసారం చేస్తున్నట్టు, వీటిని 85 శాతం విద్యార్థులు వీక్షిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.