తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మినహా దాదాపుగా ఎన్నికల పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అయితే గతంలో కంటే ఎక్కువగా ఈసారి ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా యువత, మహిళలతో పాటు వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెబుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు సైతం పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య లివర్ సిరోసిస్‌తో బాధపడుతున్నారు. అయితే తాను బతికున్నంత వరకు ఓటు హక్కు వినియోగించుకుంటానని చెబుతూ ఆక్సిజన్ సిలిండర్‌తో ఆయన గచ్చిబౌలిలోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యత అని.. 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని ఆయన చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శేషయ్య తన ఓటు హక్కును వినియోగించుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని అంతా ఓటు వేసేందుకు కదలిరావాలని అంటున్నారు.