రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న ఈ బందిపోట్లకు ఎదురెళ్లి మోడీని నిలదీసే దమ్ము మాత్రం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. షర్మిల ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ అడగడు..మోడీ ఇవ్వడు..10 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతుంది. నిజంగా దొరకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. 5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతిసారి మొహాలు ఎందుకు చాటేశారు? విభజన హామీల సంగతి ఏంటని ఎందుకు ప్రశ్నించలేదు? తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదు? అని ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ అనుమతులపై చేసిన పోరాటాలు ఎక్కడ? కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఏదని అడిగారా? బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వ విద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల సంగతిపై పోరాడారా? ఏటా బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుంటే మీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాలేదా? గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే “బీజేపీ రాష్ట్ర సమితి” దోస్తానా. దొరకు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కేసీఆర్ అండ్ కో కు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదన్నారు.