సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ సీతారాం ఏచూరి ఈనెల 12న అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. సీతారాం ఏచూరి మరణం.. జాతీయ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాలకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభ ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు.
ఈ సభలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు ఇతర వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తమ్మినేని తెలిపారు. ఈ సంస్మరణ సభను విజయవంతం చేయాలని ప్రజలకు, ప్రజాతంత్రవాదులకు, వామపక్ష మేధావులకు సీపీఎం విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు తమ్మినేని వీరభద్రం.