తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే..ఎలాగైనా ఈ సారి గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ వేస్తోంది. ఇందులో భాగంగానే.. CPM పార్టీతో పొత్తు కోసం రంగంలోకి సోనియాగాంధీ దిగారు. తెలంగాణ రాష్ట్రంలో సీపీఎంతో పొత్తు కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రంగంలోకి దిగారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సోనియా ఫోన్ చేశారు. పొత్తుకు సహకరించాలని ఆమె కోరారు. ఇదే విషయాన్ని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి చెప్పారు సీతారాం. కాంగ్రెస్ తో చర్చలు లేవని…. ఒంటరిగానే బరిలోకి దిగుతామని తమ్మినేని తేల్చి చెప్పారు.
ఇది ఇలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిపిఎం మరో రెండు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది. హుజూర్ నగర్ లో మల్లు లక్ష్మి, నల్గొండలో ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని బరిలో నిలిపింది. మొత్తం 17 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ…. ఇటీవల 14 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా….. మరో నియోజకవర్గంలో అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది.