శ్రీరామనవమి పురస్కరించుకొని ఏటా హైదరాబాద్‌లో శోభయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ కూడా నగరంలో శ్రీ రామ శోభా యాత్ర జరగనుంది. నగరంలో శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్ననారు. శోభాయాత్ర సీతారాంబాగ్ శ్రీరాముడి ఆలయం వద్ద మొదలై మంగళ్‌హాట్, జాలీ హనుమాన్, ధూల్‌పేట్, పూరానాపూల్, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బర్తన్ బజార్, బేగంబజార్ ఛత్రి, సిద్యంబర్ బజార్, గౌలిగూడ చమన్, గురుద్వార, పుత్లిబౌలి, కోఠి మీదగా సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుని ముగియనుంది.
శోభాయాత్ర నేపథ్యంలో మూడు కమిషనరేట్ల పరిధిలో 17వ తేదీ నుంచి 18 వరకు బార్లు, మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. గోషామహల్, సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. ఊరేగింపు ప్రారంభమయ్యాక ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను బోయిగూడ కమాన్ మీదగా మల్లేపల్లి చౌరస్తా, విజయ్‌నగర్ కాలనీ, నాంపల్లి మీదగా మెహిదీపట్నం వైపు మళ్లించనున్నారు.