తెలంగాణలో ప్రశాంతతకు కారణం కాంగ్రెస్ అని.. పదేళ్లలో లేని స్వేచ్ఛను ప్రజలు ఇప్పుడూ అనుభవిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నారని.. ఈ ప్రశాంతతకు కారణం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ను తెచ్చుకోవడమేనని స్పష్టం చేసారు.
గత పదేళ్లలో ప్రజలు నోరు విప్పే స్వతంత్రం కూడా లేదని.. కానీ ఇప్పుడు మాకు ఈ బాధ ఉందని చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాతనే కల్పించిందని తెలిపారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు తాము స్వతంత్రం ఇచ్చామని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వతంత్రం వల్లే కేసీఆర్ సభ సక్సెస్ అయిందని అన్నారు. మీ పదేళ్ల పరిపాలనలో ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశమే ఇవ్వలేదని.. పోలీసులను పెట్టి మా నాయకులను నిర్బందాలకు గురి చేశారని మండిపడ్డారు.