రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త గళాలు రోజురోజుకు గట్టిగా వినిపిస్తున్నాయి. అసంతృప్తితో కొంతమంది పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆమె నిర్ణయం తన కుటుంబంపై భారంగా పడనుందా అంటే తాజాగా జరిగిన ఓ పరిణామం చూస్తుంటే అలాగే కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో టాక్. ఇంతకీ ఏం జరిగిందంటే..?
మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న శరత్‌చంద్ర పవార్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆయన రేఖానాయక్ అల్లుడు. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీచేస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, డిసెంబరు 26న శరత్‌చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. శరత్‌చంద్ర ఎమ్మెల్యే రేఖానాయక్ అల్లుడు కావడం.. ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధంచేసుకున్న సమయంలో ఆయన బదిలీ చర్చనీయాంశమైంది.