ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. మార్చి 15న ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. కేసు విచారణ జరుగుతుండగానే అరెస్టు చేసినట్లు అందులో ఆరోపించారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోము అని కోర్టుకు చెప్పి… దర్యాప్తు సంస్థ అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి.. దర్యాప్తు సంస్థ పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఆన్లైన్ లో.. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు… సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు దిల్లీ మద్యం కేసులో ఈడీ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఇప్పటివరకు దిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబయి సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశామన్న ఈడీ దిల్లీ మద్యం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ప్రెస్‌నోట్‌లో తెలిపింది.