ఈ నెల 21వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ – తలసాని ప్రకటన

ఈ నెల 21వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో రెండవ విడత డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపు డ్రా కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ నుండి భారీగా దరఖాస్తులు వచ్చాయని.. 13200 ఇండ్ల డ్రా ను నేడు తీస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి ఇండ్లను కట్టి ఇచ్చిన దాఖలాలు లేవని..ఢిల్లీ లోని ఐ ఏ ఎస్, ఐపీఎస్ ల క్వార్టర్స్ ల కు ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడి డబుల్ బెడ్ రూం లు ఉన్నాయని మన మాజీ గవర్నర్ నరసింహన్ చెప్పారన్నారు.

2 BHK లో రిజర్వేషన్ లను అమలు చేస్తున్నామని.. మూసీ నది ప్రాంతంలో ఆక్రమణలో ఉన్న వారికి పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే ఇంకా ఇండ్లను నిర్మిస్తామని.. ఈ నెల 21వ తేదీన 2BHK పంపిణీ చేస్తామని వెల్లడించారు. లబ్ధిదారుల అడ్రస్ మారితే వారు ఇది వరకు ఇచ్చిన అడ్రస్ కు సమాచారం ఇస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.