కామారెడ్డిలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. అక్కడి ఓ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. కేసీఆర్ పోటీ చేయడం కామారెడ్డి ప్రజల అదృష్టం అని అన్నారు. కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు ఊహకందని మెజారిటీని ఇవ్వాలని కోరారు. రూ.8 కోట్లతో కామారెడ్డిలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని తలసాని తెలిపారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాబోతోందని తలసాని జోస్యం చెప్పారు.
కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ చేతులెత్తేసిందన్నారు. కామారెడ్డి రూపురేఖలు రెండు మూడు నెలల్లో పూర్తిగా మారబోతున్నాయని చెప్పారు. మాటలతో ప్రజలను బీజేపీ నాయకులు మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.
’65 సంవత్సరాల ప్రజల గోసను తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ తీర్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద 7200 కోట్ల రూపాయలతో బడులను అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేసీఆర్ పాటు పడుతున్నారు.’ అని మంత్రి తలసాని అన్నారు.