నన్ను రాజకీయ నాయకురాలు అంటున్నారని తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలి.. దాంట్లో రహస్యం, దాచి పెట్టడానికి ఏమీ లేదని వెల్లడించారు.
తెలంగాణలో కొందరు నన్ను రాజకీయ నాయకురాలు అంటారు.. అది నిజమే కదా అంటూ బీఆర్‌ఎస్ నేతలకు చురకలు అంటించారు గవర్నర్ తమిళి సై. నేను తెలంగాణ గవర్నర్ గా వచ్చినపుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మహిళా మంత్రులు లేరని మండిపడ్డారు. నేను గవర్నర్ అయిన తర్వాత మహిళా మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి ఉందని.. నా మీద రాళ్లు విసిరితే.. వాటితో భవంతులు కడతా అంటూ పేర్కొన్నారు. దాడి చేసి రక్తం చూస్తే.. ఆ రక్తంను సిరగా మార్చి నా చరిత్ర రాస్తానని వెల్లడించారు తమిళి సై. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గను.. ప్రధాని మోడీ నాయకత్వంతోనే మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందన్నారు గవర్నర్ తమిళి సై.