గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈఎస్ఎల్ నరసింహన్ అనంతరం రాష్ట్రానికి రెండో గవర్నర్‌గా.. మొదటి మహిళా గవర్నర్‌గా తమిళిసై 2019 సెప్టెంబర్ ఎనిమిదో తేదీన బాధ్యతలు స్వీకరించారు. అప్పట్నుంచి గవర్నర్‌గా కొనసాగుతూ నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టారు. రెండేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా తమిళిసై అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా గవర్నర్ ఇవాళ కాఫీ టేబుల్ బుక్ విడుదల చేయనున్నారు.
గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు మొదట్లో బాగానే ఉన్నా.. వివిధ కారణాలతో క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. ప్రొటోకాల్ సహా పలు అంశాల విషయంలో.. అంతరం రోజురోజుకూ పెరిగిపోయింది. ప్రభుత్వ విధానాలను గవర్నర్ తప్పు పట్టడంతో పాటు బిల్లులు సహా సర్కార్ నిర్ణయాలకు ఆమోదం తెలపని పరిస్థితి ఏర్పడింది. కొన్ని బిల్లులను వెనక్కు పంపగా ప్రభుత్వం ఉభయసభల్లో వాటిని యధాతథంగా తిరిగి ఆమోదించుకుంది. ఆర్టీసీ బిల్లు సహా 12 బిల్లులపై గవర్నర్ తమిళిసై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.