నేడు ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో డిగ్రీ కాలేజీ సమీపంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, పక్కన 38.50 కోట్లతో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయ భవనానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అలాగే మోడల్ బస్టాండ్ కాంప్లెక్స్ , సేవాలాల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లా పర్యటనపై ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో తమ జిల్లాకు ఇంకా గోదావరి నీళ్లు రావడం లేదని అన్నారు సీతక్క. ఏటూరు నాగారం ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇవ్వలేదని, మెడికల్ కాలేజీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. తనను ఓడించాలని ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు సీతక్క. ప్రజలకు సేవ చేసే తనను ఎందుకు ఓడించాలని ప్రశ్నించారు.