రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలలో మెజార్టీ గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీలకు ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు టీ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి లేదా నల్గొండ నుంచి లోక్ సభ బరిలో నుంచి రాహుల్ గాంధీ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని సమాచారం.
రాహుల్ గాంధీ దీనికి అంగీకరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ ఇచ్చినందుకు కృత జ్ఞతగా ఇటీవల సోనియాగాంధీని కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలో నిలపాలని భావించినా సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. మరోవైపు సోనియా పోటీ చేసిన రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో సోనియాకి బదులుగా రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే.. బాగుంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీ గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సౌత్ నుంచే రాహుల్ పోటీ ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాన నుంచి రాహుల్ గాంధీ పోటీకి సంబంధించి కాంగ్రెస్ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.