తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభవార్త. ఇవాళే పది ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఇవాళ హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పదో తరగతి పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల వరకు పరీక్షలు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 8వేల 385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 2లక్షల 57వేల 952 మంది కాగా, బాలికలు 2లక్షల, 50 వేల 433 మంది ఉన్నారు. ఏప్రిల్ 20వ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేశారు. పది ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించగానే వాటిని అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.inకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు.