తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండుగ అన్నవాళ్లే ఇప్పుడు సాగు పండుగ అంటున్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయాభివృద్ధికి సర్కారు అహర్నిశలు కృషి చేస్తోంది. బీడుబారిన వ్యవసాయ భూములు ప్రభుత్వం కల్పించిన సాగు నీటి వసతితో పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని.. వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధిపై రూపొందించిన ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణణాన్ని 2 కోట్ల 16 లక్షల ఎకరాలకు పెంచినట్లు సర్కార్ తెలిపింది. రైతు సంక్షేమంలో భాగంగా 27 లక్షల వ్యవసాయ మోటార్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగు నీటివసతి ఏర్పడగా.. వచ్చే రెండు, మూడేళ్లలో మరో 50 లక్షల ఎకరాలకు ఇవ్వనుందని తెలిపింది. 2 కోట్ల పద్దెనిమిది లక్షల టన్నుల వరిధాన్యం ఉత్పత్తితో.. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ అవతరించింది. గత తొమ్మిది సంవత్సరాలలో వ్యవసాయ ఉత్పత్తి తొమ్మిది రెట్లు పెరిగిందని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.