తమది లక్షల కోట్ల రూపాయల బడ్జెటని గొప్పలు పోతున్న జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదా?, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకపోవడం అన్నది ముమ్మాటికీ ఈ ప్రభుత్వ వైఫల్యమేనని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు.
తాజాగా రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోతే, అయ్యా… ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బులు కావాలని జోలె పట్టుకొని అడుక్కుని ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చి ఉండేవారని, కేఏ పాల్ గారికి చెప్పినా విదేశాల నుంచి నిధులు తెచ్చి ఇచ్చి ఉండేవారేమోనని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయకపోవడం అన్నది ఈ ప్రభుత్వ వైఫల్యమేనని… బటన్ నొక్కి అన్ని వర్గాల ప్రజలకు డబ్బులు ఇస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోవడమన్నది ఆయన ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. 2024 జూన్ మాసానికి పూర్తి చేయమని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షేకావత్ గారు చెబుతుంటే, 2025 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.