రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రారంభ ఘట్టానికి రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరికాసేపట్లో విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్‌కు ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తీసుకున్నారు. ఇవాళ్టి తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో కొత్త శాసనసభ ఏర్పాటుకు వీలుగా సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు.
అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లను ఈ నెల పదో తేదీ వరకు స్వీకరిస్తారు. ఈనెల 5వ తేదీ ఆదివారం కావడంతో సెలవు రోజుల్లో నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండదు. నామపత్రాల పరిశీలన 13వ తేదీన చేపడతారు. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 15. పోలింగ్ ఈ నెల 30 తేదీన నిర్వహించి వచ్చే నెల మూడో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. డిసెంబర్ ఐదో తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.
ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా నేటి నుంచే రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 60 మంది ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. వారు రేపట్నుంచి విధుల్లో ఉంటారు. వారికి సహాయకంగా ఇతర అధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు.