తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే విపక్ష సభ్యుల ఆందోళనతో శాసన సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ రేపటికి వాయిదా వేశారు. లగచర్ల అంశం పై శాసనసభలో చర్చకు బీఆర్ఎస్ పట్టు బట్టింది. పర్యాటక శాఖ పై కాకుండా లగచర్ల రైతుల బేడీల విషయంలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలని ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపారు. దీంతో సభ్యుల ప్లకార్డులు తీసుకురావాలని మార్షల్స్ కి స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు.
ప్లకార్డులు మార్షల్స్ కి ఇస్తే.. మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలు నిలిపివేయలేదు. దీంతో నినాదాల చేస్తుంటే.. స్పీకర్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అవుతుందని వెల్లడించారు స్పీకర్. సమావేశాలు వాయిదా వేసిన తరువాత కూడా లగచర్ల రైతులకు బేడీల విషయంలో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ శాసన సభ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.