అమరావతి రాజధాని రైతుల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలని ఆర్-5 జోన్ తీసుకొచ్చిందని ఆరోపించారు.
ఆర్-5 జోన్ లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు ఇస్తామని చెప్పారు. సుప్రీంకోర్టులో రాజధాని పై ఉన్న కేసులు పరిష్కరించేలా ముందుకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఇక మరో తొమ్మిది నెలల్లో అమరావతిలో అధికారులకు నివాసాలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తప్పకుండా పూర్తి చేస్తామని..మూడేళ్లలో ఇది సాధ్యం కానుందని తెలిపారు. ఇప్పటికే రూ.20వేల కోట్ల వరకు పనులకు సంబంధించిన టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం లభించిందని.. నాలుగు ఐదు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని మంత్రి నారాయణ వెల్లడించారు.