తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై బీఏసీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈనెల 15న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16వ తేదీన శాసనసభలో, మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెట్టి చర్చిస్తారు. 17వ తేదీన సైతం సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
ఇక గురువారం రోజున శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్లు స్వీకరించనున్నారు. శాసనసభాపతిగా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ను ఎన్నుకోవాలని ఇప్పటికే కాంగ్రెస్ తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఏకగ్రీవం కానుండగా ఇంకేవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది.
ఈనెల 10వ తేదీన కొత్తగా ఏర్పాటైన సర్కార్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకుని ఆయనతో సహా 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. పలు కారణాలతో మరో 18 మంది ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఆరోజు వాయిదా పడిన సమావేశాలు తిరిగి రేపు ప్రారంభం కానున్నాయి.