ఒకరోజు విరామం తర్వాత తెలంగాణ శాసనసభ సమావేశాలు తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. తొలుతు ఈనెల 13వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే రేపు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్శన తర్వాత సాగునీటి శాఖపై శ్వేత పత్రాన్ని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున శాసనసభ జరిగే అవకాశం లేదని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సిన బడ్జెట్‌పై చర్చ ఈ నెల 14వ తేదీన ఉండనున్నట్లు సమాచారం. ఈ నెల 15వ తేదీన నీటి పారుదల శాఖ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి ఇంకో రోజు కూడా పొడిగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఇవాళ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు.
అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణ కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ అసెంబ్లీ వేదికగా కష్ణా జలాల ఒప్పందాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.