తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ సభలో పరస్పరం ఇరుకున పెట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాలు.. మూడు, నాలుగు రోజులు ఉండొచ్చని సమాచారం. అయితే అసెంబ్లీ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున ఇవాళ దివంగత నేతలకు నివాళులు అర్పించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కంటోన్మెంట్ దివంగత శాసనసభ్యుడు సాయన్నకు సంతాపం వ్యక్తం చేయనున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. అందులో సమావేశాలు ఎన్నిరోజులు జరపాలనే అంశం ఖరారు కానుంది. ఎన్నికలు నవంబరు లేదా డిసెంబరులో జరిగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది ఇవే చివరి సమావేశాలని భావిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు… అసెంబ్లీ, మండలిలోనూ దూకుడుగా వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నాయి.