తెలంగాణలో ఈ ఏడాది యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ యాసంగిలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ దార్శనికతకు, రైతు సంక్షేమ పరిపాలనకు ఇది నిదర్శనమని కొనియాడారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే.. ఈసారి 12 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించినట్లు మంత్రి చెప్పారు.
‘‘రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశాం. దాదాపు ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి రూ.10,200 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించాం. కొనుగోలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. ఇప్పటికే 1,400 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది’’ అని గంగుల వివరించారు. ఎఫ్‌సీఐ నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వచ్చిన ధాన్యంలో ఏ మిల్లర్ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.