తెలంగాణలో బోనాల జాతరకు వేళయింది. మరికొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సంబురం షురూ కానుంది. తెలంగాణ వ్యాప్తంగా జులై 7వ తేదీ నుంచి బోనాల జాతర ప్రారంభం కానుంది. బోనాల పండుగ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది హైదరాబాద్ బోనాలే. ఈ ఏడాది ఈ పండుగను అత్యంత వైభవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ ఆలయ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆషాఢ మాసం బోనాలకు కమిటీ సభ్యులు సీఎంను ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి ఆశీర్వచనం అందించారు. వారి ఆహ్వానాన్ని మన్నించిన రేవంత్ తప్పకుండా బోనాల పండుగకు వస్తానని మాటిచ్చారు. అయితే ఆయన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ ఈ మూడింటిలో ఓ పండుగలో పాల్గొంటారో తెలియాల్సి ఉంది. మరోవైపు బోనాల పండుగకు రూ.25 కోట్ల నిధులను మంజూరు చేయనున్నారు. ఈ ఏడాది కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బోనాల పండుగను రంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు.