ఈనెల 25న మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25న సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నట్టు సమాచారం. కాలేశ్వరం నివేదికపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఇటీవల హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టిన అనంతరం చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కాలేశ్వరం నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు ఈ భేటీలో తేదీలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే మరికొద్ది రోజుల్లో వినాయక ఉత్సవాలు మొదలవబోతుండగా.. ఉత్సవాల అనంతరమే అసెంబ్లీ సమావేశం ఉంటుందని కూడా వినిపిస్తోంది. అలాగే స్థానిక ఎన్నికలపై చర్చించనున్నట్టు సమాచారం. రేపు జరిగే PAC సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి స్థానిక ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. మరోవైపు కాళేశ్వరం నివేదిక పై కూడా అసెంబ్లీలో చర్చించే అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది.