రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. అపరిష్కృత విభజన అంశాలపై చర్చ

-

వచ్చే నెల రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. కానీ ఇప్పటివరకు వివిధ కార్పొరేషన్లు, సంస్థల విభజన వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో విభజన అంశాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి రేపు (మే 18వ తేదీన) మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో..  అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టం 9, 10వ షెడ్యూల్‌లలోని పలు అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టంలోని హెడ్‌ క్వార్టర్స్‌ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ అంటుండగా..  హైదరాబాద్​లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు, భవనాలను హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా, ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వీటిపైనే శనివారం జరగనున్న భేటీలో చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news