తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో రాష్ట్ర ఓటర్లను ఆకర్షించేలా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. మహాలక్ష్మి పథకం, రైతుభరోసా పథకం, ఇందిరమ్మ ఇళ్లు, యువవికాసం, గృహజ్యోతి, చేయూత పథకం పేర్లతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టింది. ఈ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు పీసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
అయితే సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలు సభ ముగిసిన తర్వాత దిల్లీకి పయనం కాగా.. మిగతా నేతలు మాత్రం ఇక్కడే ఉన్నారు. వారంత సభ ముగిసిన తర్వాత వారికి కేటాయించిన నియోజకవర్గాలకు చేరుకున్నారు. ఇవాళ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. 6 హామీల గ్యారెంటీ కార్డ్‌ను నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి చేర్చి.. వాటిని ప్రజలకు వివరించనున్నారు.