తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ వైద్య విద్యలో పీజీ మెడికల్ సీటు సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ రుత్‌పాల్ జాన్ అనాథ అయినా.. దాతల సాయంతో . ఎంతో పట్టుదలతో చదువుకున్నారు. కష్టపడి ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఏఆర్‌టీ సెంటర్‌లో పనిచేస్తున్నారు. వివిధ మానసిక, శారీరక సమస్యలతో వచ్చే తనలాంటి ట్రాన్స్‌జెండర్‌లతోపాటు పేద రోగులకు సేవలందిస్తున్నారు.
డాక్టర్ రుత్‌పాల్ ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు కష్టపడి చదివి పీజీ నీట్‌లో ర్యాంకు సాధించారు. ఇటీవల హైదరాబాద్ ఈఎస్‌ఐ మెడికల్ కళాశాలలో ఎండీ ఎమర్జెన్సీ కోర్సులో సీటు సాధించారు. ఫీజు కోసం రూ.2.50 లక్షల వరకు అవసరమయ్యాయి. అంతటి ఆర్థిక స్థితి లేకపోవడం.. సాయం చేసేందుకు కుటుంబం కూడా అండగా లేకపోవడంతో.. ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ చొరవతో వైద్యులు ఇతర సిబ్బంది రూ.లక్ష వరకు అందించారు. మరో రూ.1.5 లక్షలను నగరానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఎస్‌ఈఈడీ స్వచ్ఛంద సంస్థలు సమకూర్చాయి.