తెలంగాణలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత డీఎస్సీ ముగిసిన తర్వాత మరోటి నిర్వహిస్తామని, 5 వేలకుపైగా ఖాళీలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏటా రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) జరుపుతామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. వాటిని జూన్, డిసెంబరులో నిర్వహిస్తామని పేర్కొంది. అయితే దాని ప్రకారం డిసెంబరులో టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినా 45 రోజుల గడువు తప్పనిసరి. అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలకు అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు నెలల్లో ఏదో నెలలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది.
రాష్ట్రంలో ప్రతి నెల సగటున 200-300 మంది టీచర్లు పదవీ విరమణ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం 1,25,058 ఉండగా.. పనిచేస్తున్నవారు 1.03 లక్షల మంది ఉన్నారు. ఈనెల 18న ప్రారంభమయ్యే డీఎస్సీ ద్వారా 11,062 మంది కొత్త టీచర్లు రానున్నారు.