కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ వివాదం.. డీజీపీ నివేదిక కోరిన సీఈఓ

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న వేళ అభ్యర్థుల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. మరోవైపు తన వద్దకు వస్తున్న ఫిర్యాదులను విచారించి సదరు అభ్యర్థుల నుంచి వివరణ కోరుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల కేటీఆర్​పై వచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది.

అమరుల స్మారకం వద్ద మంత్రి కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ విషయం పై డీజీపీ అంజనీ కుమార్​ను సీఈఓ వికాస్ రాజ్ వివరణ కోరారు. అమర వీరుల స్మారకం వద్ద ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఒక ప్రభుత్వ ప్రదేశాన్ని.. బీఆర్‌ఎస్‌ ఎంఎల్సీ, ఒక ఎమ్మెల్యే రాజకీయ ప్రచారానికి వినియోగించడంపై జి శ్రీకాంత్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

నిందితుల పేర్లను గుర్తు తెలియనివిగా పెట్టడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేటీఆర్, గోరటి వెంకన్నపై చర్యలు తీసుకోవాలని హస్తం నేత నిరంజన్ రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరారు. దీనిపై స్పందిచిన సీఈవో వికాస్ రాజ్ ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీ అంజనీకుమార్​ను అదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news