తెలంగాణ-ఏపీల మధ్య నెలకొన్న నాగార్జునసాగర్ డ్యామ్ నీటి వివాదం ఇటీవలే సద్దుమణిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కేంద్ర ఆధీనంలోకి వెళ్లిపోయింది. మరోవైపు సాగర్ సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో ఉంది. అయితే తాజాగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని ఆయన లేఖలో కేఆర్ఎంబీని కోరారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుని తెలంగాణనే నియంత్రించాలని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డుకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు ప్రభుత్వం సహకరించిందని ఈ సందర్భంగా తెలిపారు. ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే స్పందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖలో ఈఎన్పీ మురళీధర్ కోరారు.