రేపటి నుంచి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు గుర్తింపు కార్డు చూపించాలని పేర్కొంది. అయితే ఈ సౌకర్యం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకు మాత్రమే వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఇతర రాష్ట్రాల మహిళలు బస్సుల్లో ఛార్జీ చెల్లించాల్సిందేనని, అందుకే గుర్తింపు కార్డు నిబంధన పెట్టారని చర్చించుకుంటున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఆర్టీసీ ఎండి సజ్జనార్ భేటీ తర్వాత క్లారిటీ రానుంది. కాగా, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రేపు ప్రారంభిస్తారు. మహిళలు ఈ నెల 9 నుంచి తమ గుర్తింపు కార్డు (ఆధార్ లేదా ఇతర) చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమమని.. మిగతా గ్యారెంటీల అమలుకు సంబంధించి విభాగాల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.