రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని భట్టి విక్రమార్క అన్నారు. బంగారు తెలంగాణ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆశించిన అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. గత పదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు.
రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని తెలిపారు. అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారిందని అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని.. జీతాలు, పింఛన్ల చెల్లింపులకు కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెనుసవాల్ పేరొన్నారు. దుబారా తగ్గించాం.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వెల్లడించారు. మార్చి నుంచి ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్పారు.