గ్రూపు-1 ప్రిలిమ్స్‌ వాయిదాకు హైకోర్టు నిరాకరణ

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రిలిమ్స్​ను వాయిదా వేయడానికి నిరాకరించింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు అవినాశ్‌దేశాయ్‌, పల్లె నాగేశ్వరరావులు వాదనలు వినిపిస్తూ దర్యాప్తు పూర్తి కాలేదని తెలిపారు. అది పూర్తయ్యేదాకా పరీక్షలను వాయిదా వేయాలన్నారు.

ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ అంటే దర్యాప్తు పూర్తయ్యేదాకా పరీక్షలు నిర్వహించవద్దంటారా? అని ప్రశ్నించారు. అయినా దోషులు ఎవరో నిర్ధారించాల్సింది కోర్టుగానీ దర్యాప్తు సంస్థ కాదు కదా అన్నారు. గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణకు మార్చి 17న నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని, చివరి క్షణంలో కోర్టుకు వస్తే ఎలా అని ప్రశ్నించారు. వినతి పత్రాలు సమర్పించామని, నిరసనలు తెలిపామని, ఇక ప్రయోజనం లేకపోవడంతో చివరగా కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

కమిషన్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ క్రిమినల్‌ కేసు పెండింగ్‌ ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలనడం సరికాదన్నారు. మోసం బయటపడిన వెంటనే పరీక్షలను రద్దు చేశామని, నిందితులపై చర్య తీసుకున్నామన్నారు. ఈ పిటిషన్‌ విచారణార్హం కాదని, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్లను కొట్టివేస్తున్నామని, కారణాలతో పూర్తిస్థాయి ఉత్తర్వులను వెలువరిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news