మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ వాయిదా

-

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బాగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల సమయంలో కాకరేపిన ఈ ఘటన అంతు ఏంటో చూస్తామని, దీనికి కారకులను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనులు చేయడమేంటని విస్తుపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మహాదేవపురం పీఎస్‌లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. ఈ వ్యాజ్యంపై ఇవాళ విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీఎస్ నుంచి సమాచారం తీసుకుని రెండు వారాల్లో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news