మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ సస్పెన్షన్‌

-

హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్‌ వద్ద కారుతో బారికేడ్‌లను ఢీకొట్టిన కేసుకు సంబంధించి బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆమిర్‌, మరో ఇద్దరిపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ను(ఎల్‌ఓసీ) నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్లు ఈనెల 23వ తేదీలోగా పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాలని, దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. గత డిసెంబరులో ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో షకీల్‌ కుమారుడు సాహిల్‌తోపాటు స్నేహితులపై కేసు నమోదు నమోదైన విషయం తెలిసిందే.

దర్యాప్తు కేసులో భాగంగా జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్లను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే షకీల్‌, సయ్యద్‌ సాహెద్‌ రహమాన్‌, మహమ్మద్‌ ఖలీల్‌ హైకోర్టులో శుక్రవారం రోజున అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టి ఈ కేసుపై పోలీసులు ఎందుకు అంత వేగంగా దర్యాప్తు చేస్తున్నారో తెలియడం లేదని, అదే సామాన్యులైతే ఇలానే చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాల్సి ఉండగా అరెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు వ్యతిరేకంగా జారీ చేసిన ఎల్‌ఓసీని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news