గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు.. TSPSC అప్పీలుపై నేడు హైకోర్టు విచారణ

-

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దుచేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. లంచ్‌ మోషన్‌ విచారణ చేపట్టాలని కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరిస్తూ మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్ టీఎస్పీఎస్సీ అప్పీలుపై విచారణ జరపనుంది.

గ్రూప్‌-4 పరీక్షలకు అనుబంధ నోటిఫికేషన్‌ జారీచేసినట్లుగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు జారీ చేయలేదన్న కారణంగా పరీక్షను రద్దు చేశారని కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ దాఖలు చేసిన అప్పీలులో పేర్కొన్నారు. తాను జారీ చేసిన నిబంధనలను అమలు చేయడంలో కమిషనే విఫలమైనందున పరీక్షను రద్దుచేస్తూ సింగిల్‌ జడ్జి తీసుకున్న నిర్ణయం సరికాదని.. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు సవరించే అధికారం కమిషన్‌కు ఉందని చెప్పారు.

‘అభ్యర్థుల గుర్తింపులో కమిషన్‌ తీసుకున్న చర్యల్లో లోపాలున్నాయని చెప్పలేదు. బయోమెట్రిక్‌ కొందరికి తీసుకుని, మరికొందరికి తీసుకోలేదన్నది వివాదం కాదు. అభ్యర్థుల తనిఖీకి అన్ని పరీక్ష కేంద్రాల్లో ఒకే రకమైన విధానాన్ని అనుసరించాం. ఏకపక్ష, దురుద్దేశపూరిత నిర్ణయాలైతే తప్ప జోక్యం చేసుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఇక్కడ ఏకపక్ష, దురుద్దేశపూరిత నిర్ణయాలు తీసుకున్నట్లు కమిషన్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు.’ అని అప్పీలులో అనితా రామచంద్రన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news